Friday 7 June 2013

ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూత

సంగీతం మూగబోయింది. జేవీ రాఘవులు ఇక లేరు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూశారు. 2 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 70 ఏళ్లు. జీవన తరంగాలు, కటకటాల రుద్రయ్య, ఎవడబ్బసొమ్ము, నా ఇల్లు నా వాళ్లు, రంగూన్‌ రౌడీ, సంసార బంధం, మొగుడు కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ముక్కుపుడక, 20వ శతాబ్దం, కోతలరాయుడు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు తదితర సినిమాలకు జేవీ సంగీతం అందించారు. జేవీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఘంటసాల వద్ద సహాయకుడిగా పనిచేశారు. 1970లో విడుదలైన 'ద్రోహి' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 112 సినిమాలకు సంగీతం అందించారు. నేఫధ్య గాయుకుడిగా పాటలు పాడినప్పటికీ ఆయనకు సంగీత దర్శకుడిగానే ఎక్కువ పేరు వచ్చింది. జెవి రాఘవులుగా ప్రసిద్ధుడైన జెట్టి వీరరఘావులు రైతు కుటుంబంలో జన్మించారు. వీరస్వామి నాయుడు, ఆదిలక్ష్మి దంపతులకు ఆయన ఆరో సంతానంగా జన్మించారు. హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించే భద్రాచార్యుల వద్ద అప్పట్లో ఆయన నటనను, గానం అభ్యసించారు. హరిశ్చంద్ర నాటకంలో ఆయన లోహితాస్యుడి పాత్ర ధరించేవారు. పాఠశాల విద్య అభ్యసిస్తూనే నాటకాలు వేయడానికి వివిధ ప్రాంతాలు తిరిగేవారు. ప్రముఖ కవులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ మూర్తి ఆయనకు ఉపాధ్యాయులు. వారు తమ పద్యాలను జెవి రాఘవులుతో పాడిస్తూ ఉండేవారు. ఆయనకు భార్య రమణమ్మ, నలుగురు కుమారులు వేంకటేశ్వరరావు, భాస్కర్, శ్యాం కుమార్, రవి కుమార్, ఓ కూతురు లక్ష్మి ఉన్నారు.


No comments:

Post a Comment